KCR: గెట్ రెడీ... 2 వారాల్లోనే నోటిఫికేషన్: కేసీఆర్
- ప్రచార సరళిని సమీక్షించిన కేసీఆర్
- పెండింగ్ సీట్లపై వారంలో నిర్ణయం
- ప్రకటించిన అభ్యర్థులను మార్చబోనని వెల్లడి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల్లో నోటిఫికేషన్ వెలువడనుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడుతున్న అభ్యర్థుల ప్రచార సరళిని సమీక్షించిన ఆయన, పెండింగ్ సీట్ల అభ్యర్థులపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రకటించిన 105 మందిలో ఎవరినీ మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన, మిగతా 14 నియోజకవర్గాల అభ్యర్థులను అతి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
గెలుపుపై ఎవరికీ అనుమానాలు వద్దని, ప్రజల్లోకి వెళ్లి గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇంకా అభ్యర్థులనే ఖరారు చేసుకోలేకపోయిందని గుర్తు చేసిన కేసీఆర్, ఈ విషయంలో ఎంతో ముందున్న టీఆర్ఎస్, మూడు విడతల్లో ప్రచారం జరిపేలా ప్రణాళికలు రూపొందించిందని, ప్రతి అభ్యర్థి, తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ కనీసం మూడు సార్లు వెళ్లాలని ఆదేశించారు. ఎన్నికల తేదీలు వెల్లడయ్యే నాటికి తొలి విడత ప్రచారం ముగియాలని సూచించారు.