india: తాను భారత జాతీయగీతాన్ని పాడటానికి కారణాన్ని వివరించిన పాకిస్థానీ!
- ఆసియాకప్ సందర్భంగా జనగణమన ఆలపించిన ఆదిల్ తాజ్
- బాలీవుడ్ సినిమాలో ఓ సన్నివేశాన్ని చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి
- అప్పుడే భారత జాతీయ గీతాన్ని నేర్చుకోవాలనుకున్నా
భారత్, పాకిస్థాన్ ల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ... మనమంతా ఒకటే అనే భావన ఇరు దేశాల్లోని చాలా మందిలో ఉంది. ఆసియా కప్ లో భారత్-పాకిస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మన జాతీయగీతాన్ని పాక్ అభిమాని ఆలపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 19వ తేదీన జరిగిన మ్యాచ్ కు ముందు ఆదిల్ తాజ్ అనే వ్యక్తి జనగణమనను ఆలపించాడు.
దీనిపై ఆదిల్ తాజ్ స్పందిస్తూ, బాలీవుడ్ సినిమాలకు తాను పెద్ద అభిమానినని చెప్పాడు. 'కభీ ఖుషీ కభీ ఘం' సినిమాలో జనగణమన పాడుతూ... భావోద్వేగానికి గురయ్యే సన్నివేశం ఒకటి ఉంటుందని... ఆ సీన్ ను చూస్తున్నప్పుడు తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని తెలిపాడు. అప్పుడే భారత జాతీయగీతాన్ని నేర్చుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఆసియా కప్ లో మ్యాచ్ కు ముందు పాక్ జాతీయగీతాన్ని వినిపించినప్పుడు భారతీయులంతా లేచి నిలబడటం తనను కదిలించిందని... దీంతో, భారత జాతీయగీతం వచ్చినప్పుడు వాళ్లతో కలసి తాను కూడా ఆలపించాలని అనుకున్నానని తెలిపాడు.