bollineni krishnaiah: రంజుగా నెల్లూరు రాజకీయం.. మేకపాటికి పోటీగా బొల్లినేని కుటుంబాన్ని దించిన చంద్రబాబు!
- వైసీపీలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డి
- ఆత్మకూరులో టీడీపీకి నాయకత్వలేమి
- బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించిన బాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే మిగిలి ఉన్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయం రంజుగా మారుతోంది. ఓవైపు ఆనం, మేకపాటి కుటుంబాలు వైసీపీలో చేరిన నేపథ్యంలో టీడీపీ ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రత్యక్ష రాజకీయాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించింది. ఆత్మకూరులో మేకపాటి కుటుంబానికి చెక్ పెట్టేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా కృష్ణయ్యతో మాట్లాడినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఆత్మకూరులో పర్యటించిన కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తాను టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తానని బొల్లినేని కృష్ణయ్య తెలిపారు. తాను ఆత్మకూరు నుంచి పోటీచేసి తీరాలనీ, పార్టీని బలపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని వెల్లడించారు.గతంలో తాను ఆత్మకూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు సొంత నిధులతో పెన్నానదిలో ఫిల్టర్ పాయింట్ పెట్టడంతో పాటు సొంత ట్యాంకర్లతో ప్రతిరోజూ 1.25 లక్షల లీటర్ల తాగునీటిని సరఫరా చేశానన్నారు. అదే క్రమంలో అప్పటి కలెక్టర్ రవిచంద్ర కోరిక మేరకు పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.90 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించి ఆశీర్వదించాలని ఆత్మకూరు ప్రజలను కోరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరఫున పోటీచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి గూటూరు మురళీ కన్నబాబుపై ఘన విజయం సాధించారు.