USA: అమెరికాకు చంద్రబాబు.. ఐరాసలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి!
- పకృతి సేద్యంపై చంద్రబాబు ప్రసంగం
- ప్రత్యేకంగా ఆహ్వానించిన ఐరాస పర్యావరణ విభాగం
- 2024 నాటికి ఏపీలో 60 లక్షల మంది రైతుల పకృతి సేద్యం ఆచరించేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు నిన్న రాత్రి బయలుదేరి వెళ్లారు. ఐక్యరాజ్యసమితి 2018ని ప్రకృతి సేద్యం సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు ఐక్యరాజ్యసమితిలో ఇదే అంశంపై ప్రసంగించనున్నారు. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు అనే అంశంపై చంద్రబాబు మాట్లాడతారు. నేటి నుంచి 26వ తేదీ వరకూ చంద్రబాబు అమెరికాలో పర్యటిస్తారు.
2024 నాటికి 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేపట్టేలా ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యానికి మద్దతుగా నిలుస్తామని ఐరాస పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలెం లేఖ రాశారు. ఈ విషయంలో చంద్రబాబు అనుభవాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నామనీ, ఈ సదస్సులో మాట్లాడాలని కోరారు. ఈ నెల 25న అంటే మంగళవారం ఐరాసలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.