PMJAY: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకానికి శ్రీకారం నేడు
- జార్ఖండ్‌లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- దేశంలోని 10.74 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం లక్ష్యం
- ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల బీమా సదుపాయం
దేశంలోని దాదాపు యాభై కోట్ల జనాభాకు ప్రయోజనం కలిగించే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పేరుతో అమల్లోకి తెస్తున్న ఈ పథకానికి ఆదివారం జార్ఖండ్ రాష్ట్రంలో ప్రధాని శ్రీకారం చుడతారు. పట్టణ ప్రాంతాల్లోని 2.33 కోట్ల కుటుంబాలు, గ్రామీణ ప్రాంతంలోని 8.03 కుటుంబాలు కలిపి మొత్తం 10.74 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నాయి. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షలు చొప్పున బీమా సదుపాయం కల్పిస్తారు. తెలంగాణ, ఒడిశా, పంజాబ్, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు మినహా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం అమలుకు ముందుకువచ్చాయి. ఆయుష్మాన్ భారత్-జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్ (ఏబీ`ఎన్‌హెచ్‌పీఎం) అని తొలుత ఈ పథకానికి పేరు పెట్టాలని యోచించిన కేంద్రం అనంతరం పీఎంజేఏవైగా మార్పు చేసింది. లబ్ధిదారులు పథకంలో తమ పేరుందో లేదో తెలుసుకునేందుకు ఎంఈఆర్‌ఏ.పీఎంజేఏవై.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఆధార్/రేషన్/ఓటరు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాని నంబర్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. లేదంటే 14555 నంబర్‌కు కాల్ చేయొచ్చు.