Andhra Pradesh: విజయనగరంలో ఫ్లెక్సీ ఫైట్.. వైసీపీ-టీడీపీ పోటాపోటీ ఫ్లెక్సీలు!

  • ఫ్లెక్సీల్లోకి ఎక్కుతున్న అవినీతి ఆరోపణలు
  • ఎక్కడికక్కడ ఫ్లెక్సీల ఏర్పాటు
  • రేపు విజయనగరం జిల్లాలో అడుగుపెట్టనున్న జగన్ పాదయాత్ర

ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు విజయనగరం వైపు మళ్లాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర సోమవారం విజయనగరం జిల్లాలో ప్రవేశించనుంది. జిల్లాలోని శృంగవరపు కోట నియోజకవర్గంలోని కొత్తవలసలో ఆయన అడుగుపెట్టనున్నారు. విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడంతోనే జగన్‌కు ఝలక్ ఇవ్వాలని భావించిన టీడీపీ నేతలు.. జగన్‌పై పత్రికల్లో వచ్చిన ఆరోపణలను ఫ్లెక్సీల్లో ముద్రించి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు.

జగన్‌పై అవినీతి కేసుల నుంచి బొత్స అక్రమాల ఆరోపణలకు వరకు ఏ ఒక్కదానిని వదలకుండా అచ్చేయించారు. ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయడంతో అందిరినీ ఆకర్షించాయి. అంతేకాదు, విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సహా ప్రధాన కూడళ్లలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు దగ్గరుండి చూసుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం అశోక్ గజపతి రాజు, మంత్రి సుజయ్‌ సందర్శించారు.

జగన్ అవినీతి ఆరోపణలను టీడీపీ ఫ్లెక్సీలుగా ముద్రించి ఏర్పాటు చేయడాన్ని చూసి తట్టుకోలేని వైసీపీ నేతలు కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఫ్లెక్సీల యుద్ధానికి తెరలేపారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలను ఫెక్సీల్లో ముద్రించి ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా విశాఖ భూ కుంభకోణంలో టీడీపీ నేతల పాత్రకు సంబంధించిన కథనాలను ముద్రించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆహ్వానానికి బదులు ఇలా అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఫ్లెక్సీలు రోడ్లపై దర్శనమిస్తుండడంతో అందరూ వాటిని ఆసక్తిగా చూసి చదువుకుని వెళ్తున్నారు.

Andhra Pradesh
Vizianagaram
Jagan
YSRCP
Telugudesam
Ashok Gajapathi Raju
  • Loading...

More Telugu News