Chittoor District: ఇళ్లలో చెట్లు కాదు.. చెట్ల మధ్యన ఇళ్లు ఉండాలి!: ఏపీ సీఎం చంద్రబాబు
- తిరుపతిని ఆవాసయోగ్య నగరంగా మారుస్తామని ప్రకటన
- నగరవనం, డిజిటల్ డోర్ వ్యవస్థ ప్రారంభం
- 5 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని వెల్లడి
దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తిరుపతి నిలవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇళ్లలో చెట్లు కాకుండా చెట్ల మధ్యన ఇళ్లు ఉండేలా ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజు తిరుపతిలో పర్యటించిన ముఖ్యమంత్రి రూ.23 కోట్లతో ఏర్పాటుచేసిన నగరవనంతో పాటు పట్టణంలో డిజిటల్ డోర్ నంబర్ల వ్యవస్థ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డిజిటల్ డోర్ నంబర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందుతున్నాయో? లేదో? తెలుసుకోవచ్చన్నారు.
కపిలతీర్థం నుంచి అలిపిరి వరకూ రూ.23 కోట్లతో నగరవనాన్ని ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. తిరుపతిని ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. చిత్తూరును ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాము ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామనీ, ప్రస్తుతం ఏపీలో దాదాపు 5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వెల్లడించారు. నిరుద్యోగులు, యువతను ఆదుకునేందుకు, వారికి ఉపాధి కల్పించేందుకు వీలుగా ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు.