East Godavari District: అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి?: జేసీపై హోంమంత్రి చినరాజప్ప ఆగ్రహం
- పోలీసులు నాలుక కోస్తామనడం సరికాదు
- నాపై జేసీ విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
- పిఠాపురంలో పర్యటించిన హోమంత్రి
అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ పోలీసుల వివాదంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జేసీ వ్యవహారశైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పోలీస్ అధికారుల తీరు కూడా సరిగా లేదని చురకలు అంటించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఈ రోజు పర్యటించిన చినరాజప్ప మీడియాతో మాట్లాడారు.
జేసీ దివాకర్ రెడ్డి తనపై చేసిన విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని చినరాజప్ప అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. వాళ్లు సక్రమంగా పనిచేశారు కాబట్టే చిన్నపొలమడలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని అన్నారు. నాలుకలు కోస్తామంటూ పోలీసులు అనడం కూడా సరికాదని, అధికారులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.