rafel: మోదీకి మచ్చ తెచ్చిన.. రాఫెల్ స్కామ్ ఎలా వెలుగు చూసిందంటే..?
- ఫ్రాంకోయిస్ భార్య నిర్మించిన చిత్రానికి రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పెట్టుబడి
- రాఫెల్ ఒప్పందంపై దాని ప్రభావం లేదన్న ఫ్రాంకోయిస్
- రిలయన్స్ డిఫెన్స్ ను భారత ప్రభుత్వమే సూచించిందన్న మాజీ అధ్యక్షుడు
- తమకు మరో అవకాశం లేకపోయిందన్న ఫ్రాంకోయిస్
- ఒప్పందంలో ప్రభుత్వ పాత్ర లేదంటున్న భారత రక్షణ శాఖ
గత నాలుగున్నరేళ్లుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న ప్రధాని మోదీకి రాఫెల్ యుద్ధ విమానాల రూపంలో పెద్ద చిక్కే వచ్చిపడింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ఇండియా పార్టనర్ గా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ను సూచించింది భారత ప్రభుత్వమేనంటూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ స్పష్టం చేయడంతో మోదీ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు మూకుమ్మడి దాడిని ప్రారంభించాయి. అసలు రాఫెల్ ఒప్పందం వెనకున్న నిజాలు ఎలా వెలుగు చూశాయో తెలుసుకుందాం.
డీల్ వెనకున్న నిజాలను వెలుగులోకి తెచ్చింది ఫ్రాన్స్ కు చెందిన ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నల్ 'మీడియాపార్ట్'. జాతీయ మీడియా ఎన్డీటీవీతో మీడియాపార్ట్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎడ్వీ ప్లీనెల్ మాట్లాడుతూ అన్ని వివరాలను వెల్లడించారు. రాఫెల్ డీల్ కు, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కు మధ్య ఏదైనా లింక్ ఉందా? అనే కోణంలో తాము ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని ఎడ్వీ తెలిపారు.
ఫ్రాంకోయిస్ భార్య జూలీ గయెట్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలసి ఒక చిత్రాన్ని నిర్మించారని... అప్పటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ ఢిల్లీ పర్యటనకు రావడానికి రెండు రోజుల ముందే ఈ చిత్రానికి సంబంధించి జూలీ, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. 2016 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాంకోయిస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలోనే 36 రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన ఒప్పందంపై మోదీ, ఫ్రాంకోయిస్ లు సంతకం చేశారు.
ఈ నేపథ్యంలో, ఈ డీల్ కు సంబంధించి ఫ్రాంకోయిస్ తో తాము మాట్లాడటం జరిగిందని ఎడ్వీ తెలిపారు. గయెట్ నిర్మిస్తున్న సినిమాకు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పెట్టుబడి పెట్టిందని... ఈ నేపథ్యంలో దాని ప్రభావం రాఫెల్ డీల్ పై పడిందా? అని ఫ్రాంకోయిస్ ను తాము ప్రశ్నించామని చెప్పారు. దీనికి సమాధానంగా... అలాంటి ప్రభావాలు ఏమీ లేవని... రిలయన్స్ డిఫెన్స్ ను భాగస్వామిగా చేసుకోవాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసిందని, దీంతో తమకు మరో ఛాయిస్ లేకపోయిందని ఫ్రాంకోయిస్ సమాధానమిచ్చారని తెలిపారు. తాము వెలుగులోకి తీసుకొచ్చిన, ప్రచురించిన అంశానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
మరోవైపు భారత రక్షణశాఖకు చెందిన ఓ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, మీడియాపార్ట్ కథనాన్ని తాము అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఈ ఒప్పందం వెనుక భారత ప్రభుత్వం కానీ, ఫ్రెంచ్ ప్రభుత్వం కానీ లేవని తెలిపారు. ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ కంపెనీనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ను భారత భాగస్వామిగా ఎంపిక చేసుకుందని భారత ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. రెండు ప్రైవేట్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో ప్రభుత్వ పాత్ర ఏమాత్రం లేదని చెబుతోంది.
రాఫెల్ డీల్ లో భాగంగా ఏరోస్పేస్ పరికరాలను రిలయన్స్ డిఫెన్స్ తయారు చేస్తుంది. ఒప్పందంలోని ఒక క్లాజ్ ప్రకారం... ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ (రిలయన్స్ డిఫెన్స్)కు కనీసం రూ. 30వేల కోట్ల వ్యాపారం ఉండేలా రాఫెల్ తయారీదారు డస్సాల్ట్ నిర్ధారించాలి.