Nellore District: రెండో రోజుకు చేరుకున్న రొట్టెల పండుగ.. నేడే గంధమహోత్సవం!
- ఉద్యోగం, వివాహ రొట్టెలకు డిమాండ్
- దాదాపు రెండు లక్షల మంది హాజరు
- 360 సంవత్సరాలుగా కొనసాగుతున్న వేడుక
కులమతాలకు అతీతంగా జరుపుకునే రొట్టెల పండుగ రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. తొలి రోజు దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరయినట్లు అధికారులు తెలిపారు. తొలి రోజున ఉద్యోగం, వివాహం రొట్టెలకు మంచి డిమాండ్ ఏర్పడిందని వెల్లడించారు. ఈ రొట్టెలతో పాటు సంతానం, ఐశ్వర్యం రొట్టెల కోసం కూడా ప్రజలు భారీ ఎత్తున వచ్చారని తెలిపారు.
ఉద్యోగం, వివాహం లేదా ఇతర కోరికలతో ఇక్కడి బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలను వదులుతారు. అవసరమైనవారు వారితో మాట్లాడి రొట్టెను పట్టుకుంటారు. ఇలా రొట్టెలు తీసుకున్న ప్రజల కోరికలు నెరవేరుతూ ఉండటంతో ఈ రొట్టెల పండుగకు కులమతాలకు అతీతంగా ప్రజలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో దీన్ని రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ వేడుకకు 360 సంవత్సరాల చరిత్ర ఉంది. 1651లో సౌదీలోని మక్కా నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటక ప్రాంతంలో హైదర్ అలీ పరిపాలన, నెల్లూరు ప్రాంతంలో నవాబుల పాలన ఉండేవి. ఆ సమయంలో వివిధ ప్రాంతాల్లో మత విభేదాలు రాజుకున్నాయి. తమిళనాడులో వాలాజా రాజులపై దండెత్తడానికి బీజాపూరు సైన్యం బయల్దేరింది. వారితోపాటే ప్రచారానికి వెళ్లిన మక్కావీరుల బృందం యుద్ధ రంగంలో దిగింది. కొడవలూరు దగ్గర జరిగిన యుద్ధంలో వీరు అమరులయ్యారు. ఈ కదనరంగంలో ఆ 12 మంది వీరుల తలలు గండవరంలో నేలరాలినా.. మొండాలు మాత్రం గుర్రాలపైనే నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరాయి.
స్వర్ణాల చెరువు దగ్గర నిత్యం దుస్తులు ఉతికే ఓ రజక దంపతులకు ఓరోజు రాత్రి కలలో ఈ 12 మంది మృతవీరులు కనిపించారట. అప్పటి నెల్లూరును పాలిస్తున్న ఆర్కట్ రాజు భార్య అనారోగ్యంతో ఉందనీ, మా శరీరాలు కలిసిన ప్రాంతంలోని మట్టిని తీసుకెళ్లి తిలకం దిద్దితే ఆమె అనారోగ్యం తగ్గుతుందని చెప్పారట. ఈ సమాచారాన్ని రాజభటుల ద్వారా రజకులు రాజుకు తెలియజేశారు. రాజు కూడా దీనికి అంగీకరించటంతో కొద్దిరోజులకే ఆమె అనారోగ్యం తగ్గిపోయిందట.
దీంతో రాజ దంపతులు ఈ చెరువు దగ్గరకొచ్చి మత ప్రచారకులు మట్టిలో కలిసిన చోట దర్గాలు కట్టించారు. ఇలా పూజలు చేసేందుకు వచ్చేటప్పుడు తమతోపాటు తెచ్చుకున్న రొట్టెలను ఇక్కడే తిని, మిగిలిన వాటిని అక్కడి వారికి పంచేవారట. అలా.. చెరువు దగ్గర రొట్టెలు తినటం, మిగిలినవి పక్కవారికి ఇవ్వటం రొట్టెల పండుగగా మారింది.