s-400: బీ కేర్ ఫుల్.. కఠినమైన ఆంక్షలు విధిస్తాం: ఇండియాకు అమెరికా వార్నింగ్
- రష్యాతో మిలిటరీ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేస్తే ఆంక్షలు తప్పవు
- నిన్ననే చైనాపై ఆంక్షలు విధించిన అమెరికా
- ఎస్-400 లాంటి వ్యవస్థలను కొనుగోలు చేయడం అమెరికా చట్టాలకు విరుద్ధం
రష్యా నుంచి కొన్ని బిలియన్ల డాలర్లతో ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే తుది చర్చలు పూర్తయ్యాయి. ఈ వ్యవహారంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. భారత్ పై కఠినమైన ఆంక్షలను విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అమెరికా శత్రువులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఇతర దేశాల సంస్థలు, వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (కాస్టా)పై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న సంతకం చేశారు.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసిన వెంటనే... చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా రక్షణ శాఖకు చెందిన ఎక్విప్ మెంట్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ తో పాటు ఆ సంస్థ డైరెక్టర్ లి షాంగ్ఫుపై ఆంక్షలను విధించింది. రష్యా నుంచి సుఖోయ్-35 ఫైటర్ జెట్లతో పాటు ఎస్-400 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లను ఇటీవల రష్యా నుంచి కొనుగోలు చేయడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, రష్యాను దృష్టిలో పెట్టుకునే ఈ ఆంక్షలను విధిస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అమెరికా అధికారి తెలిపారు. ప్రత్యేకంగా ఏ ఒక్క దేశాన్నైనా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ ఆంక్షలను విధించడం లేదని ఆయన చెప్పారు. రష్యా చర్యలను నియంత్రించేందుకే ఆంక్షలు విధిస్తున్నామని అన్నారు. అమెరికాను, అమెరికా మిత్ర దేశాలను ఇబ్బంది పెట్టేందుకు రష్యా యత్నిస్తోందని విమర్శించారు. ఎస్-400 లాంటి వ్యవస్థలను కొనుగోలు చేయడం అమెరికా కాస్టా చట్టానికి వ్యతిరేకమని చెప్పారు. చైనాపై ఆంక్షలను విధించడాన్ని ఇతర దేశాలు అర్థం చేసుకోవాలని... రష్యాన్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ సెక్టార్లతో ఒప్పందాలు చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు.