tulasireddy: రైతు రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీ రావాలి: ఎన్.తులసిరెడ్డి
- వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది
- దీనికి కారణం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలే
- వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, మళ్లీ రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, రాహుల్ ప్రధాని కావాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.తులసి రెడ్డి పేర్కొన్నారు.
ఈ రోజు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం, రాష్ట్రం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదట నుంచి వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తు ఉండేవని తులసి రెడ్డి అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్, ధవళేశ్వరం బ్యారేజి, ప్రకాశం బ్యారేజి నిర్మించి ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా చేశాయని, కాంగ్రెస్ ప్రభుత్వాలు, జలయజ్ఞనం కింద 57 ప్రాజెక్టులు చేపట్టి అందులో 11 ప్రాజెక్టులు పూర్తి చేసి, మిగతా ప్రాజెక్టులలో సింహభాగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి చేశాయని తెలిపారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా:
వ్యవసాయ విద్యుత్ బిల్లుల బకాయిల మాఫీ, లక్ష రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలు, లక్ష నుంచి 30 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీ పంట రుణాలు, సకాలంలో పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడి అమలు తదితర రైతు అనుకూల కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేశాయని గుర్తు చేశారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 72వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫి చేసి 3.2 కోట్ల మంది రైతులను రుణ విముక్తులను చేసిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 64లక్షల మంది రైతులకు రూ.11353 కోట్ల రుణమాఫీ జరిగిందని అన్నారు.
గత 4 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల, ఫసల్ బీమా, పసలేని బీమాగా తయరైనందు వల్ల, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక, పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. ఈ నేపధ్యంలో రైతులను అప్పుల ఊబిలోంచి బయట పడేయాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలంన్నింటినీ పూర్తిగా మాఫి చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని నిర్ణయించామని, దీనిపై ఏఐసీసీ 84వ ప్లీనరిలో, సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసిన విషయాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.