Rahul Gandhi: మోదీని 'దొంగ' అన్న రాహుల్ పై మండిపడ్డ వసుంధర రాజే!
- మర్యాద లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారు
- రాహుల్ ఆలోచనా ధోరణి ఎలా ఉందో ఆయన మాటలే చెబుతున్నాయి
- బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మండిపడ్డారు. ప్రధాని మోదీని 'దొంగ' అని సంబోధించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మర్యాద లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని... అవగాహన లోపం ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అన్నారు.రాహుల్ ఆలోచనా ధోరణి ఎలా ఉందో ఆయన మాటలే చెబుతున్నాయని విమర్శించారు.
రాజస్థాన్ లోని దుంగార్పూర్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ సంకల్ప్ ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, దేశ సంరక్షకుడిగా చెప్పుకుంటున్న మోదీని... దేశ ప్రజలంతా ఈరోజు దొంగగా భావిస్తున్నారని విమర్శించారు. మోదీ తీసుకొచ్చిన జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా అభివర్ణించారు.
ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టమని ప్రజలు కోరితే... బహుళ పన్నుల విధానాన్ని మోదీ తీసుకొచ్చారని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే... ఈ బహుళ పన్నుల విధానాన్ని రద్దు చేసి, దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.