Dharmabad: బాబ్లీ కేసు: నేడు కోర్టుకు చంద్రబాబు తరఫున న్యాయవాదులు!

  • ధర్మాబాద్ కోర్టులో నేడు బాబ్లీ కేసు విచారణ
  • చంద్రబాబుపై ఇప్పటికే ఎన్ బీడబ్ల్యూ
  • బాబు తరఫున కోర్టుకు న్యాయవాదులు
  • రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న లాయర్లు

దాదాపు 8 సంవత్సరాల నాడు బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నారని, 144 సెక్షన్ అమలులో ఉండగా, దాన్ని అతిక్రమించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై నమోదైన కేసులో ఆయన నేడు ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాల్సివుంది. ఈ కేసు విచారణ నేడు ధర్మాబాద్ కోర్టులో సాగనుండగా, చంద్రబాబు సహా 16 మందికి కోర్టుకు హాజరు కావాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన సంగతి తెలిసిందే.

ఇక నేడు చంద్రబాబు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లబోవడం లేదని సమాచారం. తనకు బదులుగా, తన తరఫున న్యాయవాదులను ఆయన పంపించనున్నట్టు సమాచారం. కోర్టుకు హాజరయ్యేందుకు తమ క్లయింట్ కు మరింత సమయం కావాలని వారు అడగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో వారెంట్ ను రీకాల్ చేయాలని వారు న్యాయమూర్తిని కోరనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

కోర్టు పంపిన నోటీసులు మరాఠీలో ఉండటంతో వాటిని అధ్యయనం చేసేందుకు, తనపై మోపిన అభియోగాలను తెలుసుకునేందుకు చంద్రబాబుకు మరింత సమయం అవసరమని కూడా ధర్మాబాద్ కోర్టులో న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు.

కాగా, తొలుత నేడు కోర్టుకు హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఆయన కోర్టుకు హాజరు కానవసరం లేదని న్యాయనిపుణులు ఇచ్చిన సలహా మేరకే చంద్రబాబు, ధర్మాబాద్ కు వెళ్లరాదని భావించినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News