Telangana: ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితా అభ్యంతరాలు స్వీకరిస్తాం: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి
- ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోంది
- ఓటరు నమోదుపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దు
- కొత్తగా 20 లక్షల మంది ఓట్లు నమోదు చేసుకున్నారు
‘తెలంగాణ’లో ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలియజేశారు. ఓటర్ల సవరణ జాబితా కోసం రూపొందించిన కొత్త ఈఆర్ఓ నెట్ పై అధికారులకు అవగాహన కల్పించామని, ఈఆర్ఓ నెట్ లో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితా అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఓటరు నమోదుపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని అన్నారు.
ఓటరు నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని, ఇప్పటివరకు 20 లక్షల మంది కొత్తగా తమ ఓట్లను నమోదు చేసుకున్నారని, చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తున్నామని అన్నారు. ఫొటోలు, పేర్లు ఒకే విధంగా ఉన్న లక్షా యాభై వేల ఓట్లను గుర్తించామని, ఓటర్ నమోదు కోసం చాలా ప్రచారం చేశామని వివరించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ అన్ని జిల్లాలకు చేరుకుంటున్నాయని, ఈవీఎంలలో ఓట్లు వేస్తే ఒకే పార్టీకి ఓట్లు పడుతున్నాయన్న అపోహలు వద్దని, రాజకీయ పార్టీల ముందే మాక్ పోలింగ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంల పనితీరుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని, ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇచ్చామని రజత్ కుమార్ చెప్పారు.