Chandrababu: చంద్రబాబును రక్షించడానికే సోమయాజులు నివేదిక: రఘువీరారెడ్డి ఆరోపణ
- జస్టిస్ సి.వై. సోమయాజులు నివేదికపై విమర్శ
- మీడియానే కారణంగా చూపడం పెద్ద జోక్
- మృతుల కుటుంబసభ్యుల వేదనను పెడచెవిన పెట్టారు
నాడు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మృతి చెందిన ఘటనలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును రక్షించడానికే జస్టిస్ సి. వై. సోమయాజులు నివేదిక తయారైందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో న్యాయాన్ని రక్షించాల్సిన న్యాయమూర్తులు కూడా అన్యాయమూర్తులుగా మారిపోతారని సోమయాజులు నివేదిక చెబుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి న్యాయమూర్తుల పట్ల అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నాయి కానీ, గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తుల మృతికి ప్రభుత్వాన్ని కానీ, ఆ సమయంలో అక్కడే పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రిని కానీ తప్పు పట్టకుండా సోమయాజులు ఇచ్చిన నివేదిక చూశాక.. ఇలాంటి న్యాయమూర్తుల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిపోతుందని అభిప్రాయపడ్డారు.
గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు మీడియానే కారణంగా కమిషన్ చూపడం ఇంకా పెద్ద జోక్ అని, ప్రచారం కల్పించడం మీడియా పని అని, భక్తులకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని రఘువీరారెడ్డి అన్నారు. ఈ కనీస అవగాహనను సోమయాజులు కమిషన్ గుర్తించకపోవడం చూస్తుంటే చంద్రబాబును రక్షించడానికే ఈ నివేదిక తయారు చేసినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సోమయాజులు కమిషన్ తీవ్రమైన అన్యాయం చేసిందని, చంద్రబాబు ప్రభుత్వంలో జస్టిస్ లు ఇచ్చే నివేదికలు విశ్వసనీయతను కోల్పోవడం అత్యంత బాధాకరమని, గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై నాటి కలెక్టర్ ప్రాథమిక నివేదికను పూర్తిగా విస్మరించడంలో కమిషన్ దురుద్దేశం కనిపిస్తోందని అన్నారు. మృతుల కుటుంబ సభ్యుల వేదనను కూడా కమిషన్ పెడచెవిన పెట్టిందని, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు పెద్దగా విలువ లేదని జస్టిస్ సోమయాజులు నివేదిక ద్వారా మరోసారి రుజువైందని విమర్శించారు.