Andhra Pradesh: ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేకు సోషల్ మీడియాలో వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు!
- ముస్లిం యువత హెచ్చరిక పేరుతో ఫేస్ బుక్ పోస్టులు
- కడప జిల్లా యువకులపై ఎమ్మెల్యే బుజ్జి ఫిర్యాదు
- ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
తన ప్రతిష్టకు భంగం కలిగేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత బడేటి బుజ్జి పోలీసులను ఆశ్రయించారు. కుట్ర పూరితంగా తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈమేరకు కడప జిల్లా రాయచోటికి చెందిన ఎం. నాగూర్ బాబు, సయ్యద్ బాజీ, ఎం బాషా, జి.మస్తాన్ వలీలపై ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో బుజ్జి ఫిర్యాదు చేశారు.
'ఎమ్మెల్యే బుజ్జి ఖబడ్డార్, ఏపీ ముస్లిం యువత హెచ్చరిక' అంటూ వీరంతా తనపై ఫేస్ బుక్ పై తప్పుడు ప్రచారం ప్రారంభించారని తెలిపారు. తన పేరు, ప్రతిష్టలు దెబ్బతీసేలా వీరు వ్యవహరించారన్నారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు ‘నేటి ప్రస్థానం’ అనే దినపత్రికలో 'బుజ్జీ ఖబడ్డార్' అనే శీర్షికతో ప్రచురితమయ్యాయని తెలిపారు. దీంతో సీఐ జి.మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు నలుగురు నిందితులపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.