Andhra Pradesh: ప్రబోధానంద స్వామిపై కేసు పెట్టిన టీడీపీ నేత!
- హిందూ దేవుళ్లను అవమానించారని మధుసూదన్ రావు ఫిర్యాదు
- కేసు నమోదుచేసిన గుత్తి పోలీసులు
- రసవత్తరంగా మారుతున్న తాడిపత్రి రాజకీయం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ప్రబోధానంద స్వామిపై కేసు నమోదయింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రబోధానంద ప్రసంగాలు చేశారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. వెంటనే ప్రబోధానందపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పోలీసులను కోరారు. ప్రబోధానంద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో ఫుటేజీ, సీడీలను ఈ సందర్భంగా పోలీసులకు మధుసూదన్ గుప్తా అందజేశారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసును నమోదుచేశారు. మరోవైపు ప్రబోధానంద గత మూడేళ్లుగా ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదని చెబుతున్నారు. కేవలం పౌర్ణమి రోజున.. అదీ ఎల్ సీడీ స్క్రీన్ల ద్వారా మాత్రమే ఆయన ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇటీవల తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామస్తులు, ప్రబోధానంద ఆశ్రమం వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా దాదాపు 45 మంది గాయపడ్డారు.