jc diwakar reddy: జేసీ ఆగడాలు శ్రుతి మించుతున్నాయి.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి!: ప్రబోధానంద ఆశ్రమ కమిటీ ప్రతినిధి
- రాజకీయ కక్షతోనే జేసీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు
- జేసీని ఎదుర్కోలేక ప్రబోధానంద కర్ణాటకకు వెళ్లిపోయారు
- ప్రబోధానంద కుమారుడు హత్యకు కూడా గురయ్యారు
ప్రబోధానంద ఆశ్రమంపై దాడి చేసింది ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులేనని ప్రబోధానంద ఆశ్రమ కమిటీ ప్రతినిధి బీజీ నాయుడు ఆరోపించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, రాజకీయ కక్షతోనే ఆశ్రమంపై జేసీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారని అన్నారు. గత 20 ఏళ్లుగా స్వామివారితో జేసీకి రాజకీయ కక్షలున్నాయని తెలిపారు. తమ ఆశ్రమం ఒక పుణ్యక్షేత్రమని... ఆశ్రమంలో తామంతా చాలా ప్రశాంతంగా ఉంటామని చెప్పారు. ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలకు తావే లేదని అన్నారు. కక్షతోనే ఆశ్రమంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆశ్రమంలోకి ఎవరినీ రానివ్వరంటూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని... ఆశ్రమం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బీజీ నాయుడు తెలిపారు. గతంలో బీజేపీ నేతలకు ప్రబోధానంద స్వామి ఆశ్రయం కల్పించడంతో... జేసీ సోదరురు పగ పెట్టుకున్నారని చెప్పారు. అప్పట్నుంచి తమ ఆశ్రమంపై దాడులు చేయిస్తున్నారని... జేసీని ఎదుర్కోలేకే ప్రబోధానంద కర్ణాటకకు వెళ్లిపోయారని తెలిపారు. ఆర్థికంగా కొంచెం స్థిరపడ్డాక, మళ్లీ ఆశ్రమానికి వచ్చారని చెప్పారు. రాజకీయ కక్షతోనే ప్రబోధానంద కుమారుడు హత్యకు గురయ్యారని తెలిపారు.
ఆశ్రమం ముందు ఎవరు దాడులకు పాల్పడ్డారో తమ వద్ద విజువల్స్ ఉన్నాయని బీజీ నాయుడు చెప్పారు. ఆశ్రమంలో తాము ప్రశాంతంగా ఉంటే... జేసీ వర్గీయులు రాళ్లు విసిరారని, వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. జేసీ ఆగడాలు శ్రుతి మించుతున్నాయని... ఆయన ఆగడాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రంలో మరిన్ని అరాచకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.