Anantapur District: ప్రబోధానంద వర్గీయులు రాళ్లదాడి చేస్తుంటే మాకంటే ముందే పోలీసులు పారిపోయారు!: జేసీ దివాకర్ రెడ్డి

  • తుపాకులు, లాఠీలు ఉన్నా కాళ్లకు పనిచెప్పారు
  • అధికారుల వైఫల్యం కారణంగానే ఘర్షణ జరిగింది
  • అమరావతిలో జేసీ మీడియా సమావేశం

చిన్న పొడమలలో పోలీసుల వైఫల్యం కారణంగానే భారీ స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆశ్రమంలోని ప్రబోధానంద వర్గీయులు రాళ్లదాడి చేస్తుంటే తుపాకులు, లాఠీలు ఉన్న పోలీసులు తమ కంటే ముందు పారిపోయారని విమర్శించారు. వారు కనీసం ధైర్యంగా నిలబడి గాల్లోకి కాల్పులు జరిపినా ఇంత విధ్వంసం జరిగేది కాదన్నారు. ఈ రోజు సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

చిన్నపొడమలలో శాంతిభద్రతల పరిరక్షణలో స్థానిక పోలీసులు దారుణంగా విఫలమయ్యారని జేసీ ఆరోపించారు. ఆశ్రమానికి కిలోమీటర్ దూరంలో తాను ధర్నాకు దిగానని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తాను రోడ్డుపై కూర్చుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడకు రాలేదనీ, తమను పట్టించుకోలేదని జేసీ విమర్శించారు. 15-20 ఏళ్ల క్రితం ఎర్రటోపీ పెట్టుకుని పోలీసులు ఊర్లో అడుగుపెడితే.. మట్కా, నాటు సారా, ఇతర చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్లు పరారయ్యేవారని జేసీ తెలిపారు. ప్రస్తుతం అనంతపురంలోని పోలీస్ కానిస్టేబుల్ కాలర్ ను ఓ వ్యక్తి పట్టుకుంటే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేని పరిస్థితికి అధికారులు దిగజారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఏ విషయాన్నీ తొందరగా తేల్చేయరని జేసీ వ్యాఖ్యానించారు. పోలీసులు కనీసం గాల్లో కాల్పులు జరిపి ఉన్నా, చిన్నపొడమలలో ఇంత ఘర్షణ జరిగేది కాదని తేల్చిచెప్పారు. ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులపై ఐదు సార్లు చుట్టుపక్కల గ్రామస్తులు ఫిర్యాదు చేసినా, నిన్నటివరకూ పోలీసులు పట్టించుకోలేదని వెల్లడించారు. ఆశ్రమంలో పోలీసులు ఈ రోజు చేపట్టిన తనిఖీల్లో ఆయుధాలు దొరికాయని తెలిపారు.

Anantapur District
Andhra Pradesh
jc diwakar reddy
Chandrababu
prabodhananda ashramam
Police
  • Loading...

More Telugu News