India: పాక్ తో మ్యాచ్ లో గెలిచేది ఇండియా అట... పాత లెక్కలు చూసి జోస్యం చెబుతున్న అభిమానులు!
- నేటి సాయంత్రం 5 గంటలకు మ్యాచ్
- ఆసియా కప్ లో 12 సార్లు తలపడిన భారత్, పాక్
- ఆరుసార్లు భారత్ కప్ గెలిస్తే, పాక్ గెలిచింది రెండుసార్లే
మరికాసేపట్లో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ పోరు ప్రారంభం కానుంది. ఆసియా కప్ గత చరిత్రను తవ్వి తీస్తున్న అభిమానులు, ఈ మ్యాచ్ లో విజయం భారత్ దేనంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు. గతంలో ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లను ఇందుకు ఉదాహరణలుగా చూపుతున్నారు. ఇప్పటివరకూ ఆసియా కప్ లో భాగంగా 12 సార్లు ఇండియా, పాకిస్థాన్ తలపడగా, 6 సార్లు భారత్, 5 సార్లు పాక్ విజయం సాధించగా, ఓ మారు మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
1983/84 సీజన్ లో పాక్ పై 54 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. 1988/89 సీజన్ లో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పాక్ పై భారత్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 2008లోనూ అంతే ఉత్కంఠగా సాగిన పోరులో రెండు పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది. 2017లో నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో భారత జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది. 2011/12లో ఒక పరుగు తేడాతో భారత్ గెలిచింది.
ఇక ఆసియా కప్ ను ఇప్పటివరకూ భారత్ ఆరుసార్లు కైవసం చేసుకోగా, పాక్ రెండు సార్లు మాత్రమే గెలుచుకుంది. ఆసియా కప్ లో అత్యంత విజయవంతమైన రికార్డున్నది కేవలం భారత్ కు మాత్రమే. భారత్, పాక్ ల మధ్య ఆసియాకప్ లో నమోదైన అత్యధిక స్కోరు 330 పరుగులను భారత్ చేసింది. ఇలా గణాంకాలు చెబుతూ నేటి మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని నమ్మకంతో ఉన్నారు క్రీడాభిమానులు.
భారత జట్టు అంచనా: 1. శిఖర్ ధావన్, 2. రోహిత్ శర్మ (కెప్టెన్), 3. కేఎల్ రాహుల్, 4. అంబటి రాయుడు, 5. ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), 6. కేదార్ జాదావ్, 7. హరికే పాండ్య, 8. భువనేశ్వర్ కుమార్ 9. కుల్దీప్ యాదవ్, 10. యజువేంద్ర చాహల్, 11. జస్ ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ జట్టు అంచనా: 1. ఫక్తర్ జమాన్, 2. ఇమామ్-ఉల్-హక్, 3. బాబర్ ఆజామ్, 4. షోయబ్ మాలిక్, 5. సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), 6. ఆసిఫ్ అలీ 7 .షాదాబ్ ఖాన్, 8. ఫహీమ్ అష్రఫ్, 9. మొహమ్మద్ అమిర్ / జునైద్ ఖాన్ / మొహమ్మద్ నవాజ్, 10. హసన్ అలీ, 11. ఉస్మాన్ ఖాన్.