telangana: తెలంగాణ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు!

  • ధర్నా చౌక్ ను ఎత్తివేయడంపై హైకోర్టు అసహనం
  • నగరం వెలుపల ధర్నా చేస్తే.. ఎవరు వింటారంటూ ప్రశ్న
  • శాంతి భద్రతల కోసమే ధర్నా చౌక్ ను ఎత్తివేయాలని నిర్ణయించినట్టు చెప్పిన అడ్వొకేట్ జనరల్

హైదరాబాదులో ధర్నా చౌక్ ను ఎత్తివేయడంపై ఏడాదిగా తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించవచ్చని... కానీ, పూర్తిగా అణచివేయరాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వ్యాఖ్యానించింది. ఎక్కడో నగరం వెలుపల ధర్నా చేస్తే... ఎవరు వింటారని ప్రశ్నించింది. అడవిలో మనుషులు నివసించని చోట సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తారా? అని ఎద్దేవా చేసింది.

ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు మాట్లాడుతూ, శాంతిభద్రతల కోసమే ధర్నా చౌక్ ను ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని కోరారు. ఏడాది నుంచి గడువు కోరుతూనే ఉన్నారని... ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మూడు వారాల గడువును ఇచ్చింది. 

  • Loading...

More Telugu News