pranay: మూడు నెలల నుంచే మర్డర్ స్కెచ్.. ప్రణయ్ హత్య కేసు వివరాలను వెల్లడించిన నల్గొండ ఎస్పీ
- జూలై మొదటి వారంలోనే మర్డర్ ప్లాన్
- వెడ్డింగ్ రిసెప్షన్ ను కూడా టార్గెట్ చేశారు
- అడ్వాన్స్ లో బారీ 8 లక్షలు, అస్గర్ 6 లక్షలు, కరీమ్ లక్ష తీసుకున్నారు
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు పాల్పడిన నిందితులను నల్గొండ ఎస్పీ రంగానాథ్ మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు నెలల నుంచే ప్రణయ్ మర్డర్ కు స్కెచ్ వేశారని చెప్పారు. జూలై మొదటి వారంలోనే ప్లాన్ వేశారని చెప్పారు. మారుతీరావు నుంచి రూ. 15 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అస్గర్ అలీ, అబ్దుల్ బారీ స్కెచ్ వేశారని తెలిపారు. ఈ మొత్తంలో రూ. 8 లక్షలు బారీ, రూ. 6 లక్షలు అస్గర్, లక్ష రూపాయలు కరీం తీసుకున్నారని వెల్లడించారు. మర్డర్ ప్లాన్ అమలుకు మూడు సిమ్ కార్డులు కొన్నారని చెప్పారు. కోటి రూపాయలకు డీల్ కుదిరిందని తెలిపారు.
గతంలో రెండు సార్లు మర్డర్ ప్లాన్ వేశారని... ఆగస్ట్ 17న వెడ్డింగ్ రిసెప్షన్ ను కూడా టార్గెట్ చేశారని ఎస్పీ చెప్పారు. బీహర్ కు చెందిన సుభాష్ శర్మ ఈ హత్య చేశాడని తెలిపారు. ఈ కేసులో ఏ1గా అమృత తండ్రి మారుతీరావు, ఏ2గా సుభాష్ శర్మను నమోదు చేశామని చెప్పారు. మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తన కుమార్తెకు బిడ్డ పుడితే అవమానమని మారుతీరావు భావించారని... అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారని చెప్పారు. ప్రణయ్ తల్లిదండ్రులతో మారుతీరావుకు పలుమార్లు గొవడ అయిందని... మారుతీరావు నుంచి ప్రాణహాని ఉండటంతో, వారు ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్టు ఆధారాలు లభించలేదని చెప్పారు.