Mohan Bhagwat: కాంగ్రెస్‌పై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసల జల్లు.. బీజేపీలో కలవరం!
- కాంగ్రెస్ ఆవిర్భావంతో స్వాతంత్ర్యోద్యమం మొదలైంది
- ఎందరో గొప్ప నేతలను ఈ దేశానికి అందించింది
- భగవత్ వ్యాఖ్యలపై బీజేపీలో అంతర్మథనం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపాయి. 'భావి భారతం-ఆర్ఎస్‌ఎస్ దృష్టికోణం'పై ఆర్ఎస్ఎస్ మూడురోజుల లెక్చర్ సిరీస్ సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభమైంది. పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ నిరుపమాన సేవలు అందించిందని కొనియాడారు. ఎందరో గొప్ప నేతలను దేశానికి అందించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావంతో దేశంలో గొప్ప స్వాతంత్ర్యోద్యమం మొదలైందన్నారు. ఇదే కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు కూడా ఇటీవల వార్తలొచ్చాయి. కాగా, గత నెలలో యూరప్‌లో పర్యటించిన రాహుల్ ఆరెస్సెస్‌పై విరుచుకుపడ్డారు. ఈజిప్ట్‌లోని సున్నీ ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్‌తో ఈ సంస్థను పోల్చారు.
కాగా, దాదాపు 80 నిమిషాలపాటు ప్రసంగించిన మోహన్ భగవత్ ఆరెస్సెస్ సేవలు నిరుపమానమని అన్నారు. ఆరెస్సెస్ తమ సిద్ధాంతాలను ఎప్పుడూ ఏ ఒక్కరిపైనా బలవంతంగా రుద్దదని స్పష్టం చేశారు. ఆరెస్సెస్‌ను ఇప్పటికీ కొందరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాణాల విషయంలో ఆర్ఎస్ఎస్‌తో సరితూగే సంస్థ ఏదీ దేశంలోనే లేదన్నారు.
ఆరెస్సెస్ చీఫ్ కాంగ్రెస్‌ను ప్రస్తుతించడం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన నోటి నుంచి అటువంటి మాటలు వస్తాయని ఊహించని బీజేపీ కంగుతింది. ప్రస్తుతం బీజేపీ నేతలంతా భగవత్ వ్యాఖ్యలపైనే చర్చించుకుంటున్నారు. కాగా, ఆరెస్సెస్ కాన్‌క్లేవ్‌కు బాలీవుడ్ నుంచి నవాజుద్దీన్ సిద్ధిఖీ, మనీషా కొయిరాలా, అనూ మాలిక్, రవి కిషన్, భాగ్యశ్రీ, అన్నూ కపూర్ తదితరులు హాజరయ్యారు.