Delhi: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిపై దాడి : ఏబీవీపీ కార్యకర్తలే దాడిచేశారని ఆరోపణ
- తమపై వామపక్ష మద్దతు కార్యకర్తలు దాడిచేశారని ఏబీవీపీ ప్రత్యారోపణ
- ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని గంటలకే వర్సిటీలో ఉద్రిక్తత
- ఏబీవీపీ, ఏఐఎస్‌ఏ ప్రతినిధుల మధ్య ఘర్షణ
ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాయం విద్యార్థి సంఘం నాయకుడిపై దాడి జరిగింది. ఏబీవీపీ కార్యకర్తలు తనపై దాడిచేశారని సంఘం అధ్యక్షుడు సాయిబాలాజీ ఆరోపించారు. విద్యార్థి సంఘం ఎన్నికలు జరిగిన కొన్ని గంటలకే వర్సిటీలో ఏబీవీపీ, వామపక్షాలు మద్దతిచ్చే ఏఐఎస్‌ఏ సభ్యుల మధ్య ఘర్షణలు తలెత్తాయి.
దీనిపై సాయిబాలాజీ స్పందిస్తూ, ‘ఘర్షణ సమాచారం అందగానే నేను సట్లెజ్ వసతి గృహం వద్దకు వెళ్లాను. అక్కడ ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులపై కర్రలతో దాడికి పాల్పడుతున్నారు. వారి నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించగా మాజీ విద్యార్థి సంఘాల నాయకులు నన్ను బెదిరించడమేకాక దాడికి పాల్పడ్డారు. జీలం హాస్టల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది’ అని చెప్పారు.
విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏఐఎస్‌ఏ విద్యార్థులు నాలుగు కీలక పదవులు దక్కించుకున్నారు. ఏబీవీపీ ఆగ్రహానికి ఇదేకారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే తమపైనే వామపక్ష మద్దతుదారులు దాడిచేశారని ఏబీవీపీ ప్రత్యారోపణ చేస్తోంది.
మరోపక్క, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన ముగ్గురు విద్యార్థులు సంఘం ఎన్నికలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో ఈవీఎంలతో పాటు ఎన్నికలకు సంబంధించిన కీలకపత్రాలు భద్రపరచాలని ఢిల్లీ హైకోర్టు వర్సిటీ చీఫ్ ఎన్నికల అధికారిని ఆదేశించింది.