Miryalaguda: అమృత కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది... అంతకన్నా ఇంకేమీ తోచలేదు: డాక్టర్ జ్యోతి
- ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ పంపానని చెప్పాను
- ఆపై సీరియస్ అని, 20 పర్సంట్ ఛాన్సని ప్రిపేర్ చేశాను
- మంచి వార్త చెబుతానన్న నమ్మకంతో రోజంతా అమృత ఎదురుచూసిందన్న డాక్టర్ జ్యోతి
కత్తితో దాడి తరువాత ప్రణయ్ చనిపోయాడన్న విషయాన్ని తరువాతి రోజు వరకూ అమృతకు చెప్పకుండా తాను దాచిపెట్టానని, ఆ సమయంలో అమృత పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న తనకు అంతకన్నా మరో మార్గం తట్టలేదని డాక్టర్ జ్యోతి తెలిపారు. విషయం తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో, ప్రణయ్ బతికే ఉన్నాడని అబద్ధం చెప్పానని గుర్తు చేసుకున్నారు.
ప్రణయ్ కి ఫస్ట్ ఎయిడ్ చేసిన తరువాత అంబులెన్స్ లో హైదరాబాద్ కు పంపించానని, అక్కడ ఐసీయూలో చికిత్స జరుగుతోందని, ప్రణయ్ తప్పకుండా వస్తాడని ఒక రోజంతా ఆమెను నమ్మించానని అన్నారు. ఆపై కాస్తంత సీరియస్ గా ఉన్నాడట అని, ట్వంటీ పర్సంట్ మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయట అని చెబుతూ, ఆమెను ప్రిపేర్ చేయాల్సి వచ్చిందని డాక్టర్ జ్యోతి వెల్లడించారు.
తానేదో మంచి వార్తను ఇస్తానన్న నమ్మకంతో అమృత, మరుసటి రోజు ఉదయం వరకూ ఆశగా వేచి చూసిందని, అసలు విషయం చెప్పిన తరువాత, తాను అమృత దగ్గరే మూడు గంటల పాటు కూర్చుని ఓదార్చానని అన్నారు. ఆ సమయంలో ప్రణయ్ చనిపోయాడన్న బాధలో అతని తల్లిదండ్రులు ఉన్నారని, జ్యోతిని తాను సొంత కూతురిగా భావించి ఓదార్చానని తెలిపారు.