Pakistan: పాకిస్థాన్ ప్రధాని పొదుపు మంత్రం: కీలక నిర్ణయాల అమలు ప్రారంభించిన ఇమ్రాన్‌ఖాన్
- 102 లగ్జరీ వాహనాల వేలానికి శ్రీకారం
- తొలిరోజే 34 కార్ల అమ్మకం
- రెండో దశలో 41 ఇంపోర్టెడ్ కార్లకు వేలం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ను ఆర్థికంగా గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టిన పాకిస్థాన్ నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కీలక నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు పొదుపు మంత్రం పాటిస్తున్న ఈ మాజీ క్రికెటర్ ఖర్చుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. తాజాగా ఆదాయం కోసం ప్రభుత్వం వద్ద ఉన్న ఖరీదైన లగ్జరీ వాహనాల వేలం ప్రారంభించారు.
‘మొత్తం 102 వాహనాలు వేలానికి ఉంచగా తొలి రోజు సోమవారం 34 నాన్ ఇంపోర్టెడ్ కార్ల అమ్మకం జరిగింది’ అని జియో న్యూస్ పేర్కొంది. వీటిలో కొన్ని బులెట్ ఫ్రూఫ్ వాహనాలున్నాయి. రెండో దశలో మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, టయోటా, సుజుకీ హోండా, లెక్సస్ కంపెనీలకు చెందిన 41 అత్యంత ఖరీదైన విదేశీ కార్లు, జీపులు వేలం వేయనున్నారు. త్వరలో ప్రభుత్వం వద్ద ఉన్న నాలుగు హెలికాప్టర్లను అమ్మకానికి ఉంచనున్నట్లు సమాచారం. తన నుంచే పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టిన ఇమ్రాన్ వ్యక్తిగత సిబ్బందిని తగ్గించుకున్నారు. తనతోపాటు వీవీఐపీ, వీఐపీలంతా విమానాల్లో బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణించాలని సూచించిన విషయం తెలిసిందే.