Rahul Gandhi: ఏపీలో టీడీపీతో కలిసే సమస్యే లేదు: ఊమెన్ చాందీ

  • 175 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా పోటీ
  • రేపు కర్నూలులో రాహుల్ గాంధీ పర్యటన
  • ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఊమెన్ చాందీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని, అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఊమెన్ చాందీ వ్యాఖ్యానించారు. రేపు కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్న సందర్భంగా, ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అక్కడి అవసరాలు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీతో పొత్తు కుదిరిందని, ఏపీలో మాత్రం అలా జరిగే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని, ప్రజలే తమకు పొత్తని ఆయన అన్నారు.

తన పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి కుటుంబీకులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని ఊమెన్ చాందీ వెల్లడించారు. ఆపై విద్యార్థులు, యువతీ యువకులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని, తరువాత జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. రాహుల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు సంతృప్తికరంగా సాగుతున్నాయని అన్నారు.

Rahul Gandhi
Kurnool District
Omen Chandi
Andhra Pradesh
  • Loading...

More Telugu News