Telangana: ఇదీ మా లెక్క... 36 సీట్లు అడుగుతున్న తెలంగాణ తెలుగుదేశం!
- 2014లో 15 చోట్ల టీడీపీ విజయం
- మరో 16 చోట్ల రెండో స్థానంలో
- ఆ సీట్లన్నీ అడుగుతున్న తెలుగుదేశం నేతలు
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా జట్టుకట్టిన తెలుగుదేశం - కాంగ్రెస్ తదితర పార్టీల మహాకూటమిలో సీట్ల లెక్క ఇంకా తేలలేదు. తెలుగుదేశం పార్టీ తమకు కనీసం 36 సీట్లను కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల ఫలితాల సరళిని గుర్తు చేస్తున్న ఆ పార్టీ నేతలు, లెక్కలు చెబుతూ, తమకు కావాల్సిన సీట్లను అడుగుతుండగా, అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన టీడీపీ, 72 స్థానాల్లో పోటీ చేసి, 15 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ 15 సీట్లతో పాటు, టీడీపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచిన 16 అసెంబ్లీ సీట్లను, వాటికి అదనంగా తమకు పట్టున్న మరో 5 సీట్లను... మొత్తం కలిపి 36 సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ అడుగుతోంది. అప్పటి ఎన్నికల్లో టీడీపీకి 51 చోట్ల కనీసం 20 వేల ఓట్ల కన్నా అధిక ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గాల్లో అత్యధికం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే అధికంగా ఉండటంతో ఇప్పుడూ అవే సీట్లను కోరుతోంది.
ఇప్పటికే మహాకూటమి నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, కోదండరామ్ తదితరుల మధ్య జరిగిన మొదటి దఫా చర్చలు, సీట్ల ఖరారు విషయమై ఏ విధమైన స్పష్టత రాకుండానే ముగిశాయి. ఇప్పుడు రెండో దఫా చర్చలకు సిద్ధమవుతున్న మహాకూటమి పార్టీలు, సాధ్యమైనంత త్వరగా, సీట్ల పంపకాల విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చి, ప్రచారపర్వాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఇదే సమయంలో కూటమిలోని సీపీఐ కనీసం 5 స్థానాలను కోరుతోంది.
కాగా, తాము 90 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్, మిగతా కూటమి పార్టీలయిన టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలకు 29 సీట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తోంది. సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో తర్జనభర్జన జరుగుతుండగా, తమ బలాలు, బలహీనతలను పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి.