Chinmayi Sripada: ప్రణయ్ హత్యపై స్పందించిన గాయని చిన్మయి!

  • ప్రణయ్ హత్యను కౌసల్య-శంకర్ హత్యతో పోల్చిన చిన్మయి
  • దేశంలో కులం ఓ జాడ్యంలా విస్తరించిందన్న గాయని
  • కులం పేరు చెప్పకుండా మనలేని పరిస్థితి ఉందని ఆవేదన

పరువు పోరులో ప్రాణం కోల్పోయిన ప్రణయ్ హత్యోదంతంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించింది. తన పేస్‌బుక్ ఖాతాలో ఓ లేఖను పోస్టు చేసింది. తమిళనాడులోని కౌసల్య-శంకర్‌ల హత్యతో ప్రణయ్ హత్యను పోల్చింది. దేశంలో కులం ఓ జాడ్యంలా విస్తరించిందని, కులం పేరు చెప్పుకోకుండా ఎవరైనా సరే మనలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. కులం పేరుతో పెద్ద పెద్ద కేసుల నుంచి కూడా నిందితులు ఇట్టే బయటపడుతున్నారని ఆరోపించింది.

కులం పేరుతో దేశంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని, నీళ్లకు, మట్టికి కులం సర్టిఫికెట్ ఇవ్వడంలో భారతీయులు విజయవంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. కుల జాడ్యం పోవాలంటే తొలుత పేరు చివరన ఉండే తోకలను కత్తిరించాల్సి ఉంటుందని చిన్మయి పేర్కొంది. అయితే,  అది మాత్రమే సరిపోదని, అది మనసు పొరల్లోంచి రావాలంది.
 
కులం ఒకటే అయినప్పటికీ చాలామందికి ఆర్థిక స్థితిగతులు, అమెరికా వీసా లాంటివి పెళ్లి సంబంధాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చిన్మయి వివరించింది. పెళ్లి ఖర్చుల్లో అమ్మాయి-అబ్బాయిలది చెరో సగం అనే వాళ్లు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. కుల పిచ్చి అన్ని మతాల్లోనూ ఉందన్న చిన్మయి దానిని అంత త్వరగా నిర్మూలించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
 
 కులం జాడ్యం నుంచి బయటపడేందుకు తనకు తెలిసిన కొన్ని సూచనలను చేస్తున్నానని పేర్కొంది. ఎవరైనా కుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దానిని సున్నితంగా తోసిపుచ్చాలని, కులం గురించి అడిగితే తెలియదని చెప్పాలని, విరివిగా పుస్తకాలు చదవడంతోపాటు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. ప్రతిసారీ విద్యావ్యవస్థను నిందించడం మాని పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని చిన్మయి సూచించింది.  

Chinmayi Sripada
Playback Singer
Pranay
Miryalguda
Telangana
Tamil Nadu
  • Loading...

More Telugu News