vangaveeti radha: విజయవాడ వైసీపీలో కలకలం... అలిగి వెళ్లిపోయిన వంగవీటి రాధా!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f9ff4244180c2207987330fef8d6599c33734678.jpg)
- విజయవాడ సెంట్రల్ స్థానాన్ని ఆశిస్తున్న రాధా
- బందరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలనుకుంటున్న అధిష్ఠానం
- మనస్తాపంతో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన రాధా
విజయవాడ వైసీపీలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీ కీలక నేత వంగవీటి రాధా అలకబూనారు. వివరాల్లోకి వెళ్తే, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్ ను రాధా ఆశిస్తున్నారు. అయితే, రాధాను బందరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో వైసీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తాను విజయవాడ సెంట్రల్ స్థానం నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేసి, సమావేశం మధ్యలోనే ఆయన వెళ్లిపోయారు.
రేపటి నుంచి నిర్వహింప తలపెట్టిన 'గడప గడపకూ వైసీపీ' కార్యక్రమాన్ని... విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించాలంటూ మల్లాది విష్ణుకు పార్టీ అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చాయి. దీనిపై రాధా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. అంతేకాక జిల్లాలోని అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. వీటిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది.