smuggling: స్మగ్లింగ్ వ్యవహారం.. విమానంలోనే కొట్టుకున్న పైలెట్, స్టీవార్డ్!
- పాకిస్తాన్ లోని లాహోర్ లో ఘటన
- స్టీవార్డ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పైలెట్
- ఎయిర్ లైన్స్ కు వ్యతిరేకంగా ప్రయాణికుల నినాదాలు
ఇటీవలి కాలంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఎక్కువగా ప్రయాణికులపై దాడులకు పాల్పడటం చూస్తున్నాం. అయితే, అందుకు భిన్నంగా విమానంలోని స్టీవార్డ్, పైలెట్ పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ)కు చెందిన పీకే-757 విమానం లాహోర్ నుంచి లండన్ కు శనివారం రాత్రి 9 గంటలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పైలెట్ అన్వర్ చౌధురి విమానంలో స్టీవార్డ్ గా పనిచేస్తున్న అవాయిస్ ఖురేషీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో ఖురేషీ విధుల్లో భాగంగా పలు వస్తువులను స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు.
దీంతో విమానంలో ఖురేషీని చూడగానే కోపంతో ఊగిపోయిన పైలెట్ వెంటనే అతడిని వెళ్లిపోవాల్సిందిగా చెప్పాలని మిగతా సిబ్బందికి సూచించాడు. పైలెట్ అన్వర్ వ్యాఖ్యలకు ఖురేషీ దీటుగా స్పందించడంతో ఇద్దరూ కొట్టుకున్నారు. వీరిద్దరి గొడవతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు ‘పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ డౌన్, డౌన్’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
అలా విమానం సిబ్బంది ఘర్షణతో అర్ధరాత్రి తర్వాత విమానం బయలుదేరింది. ఈ విషయమై పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.