Anantapur District: తాడిపత్రిలో ‘వినాయక నిమజ్జనం’ ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన జేసీ దివాకర్ రెడ్డి!
- చిన్నపొడమల గ్రామస్తులకు మద్దతుగా జేసీ
- ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులపై ఆగ్రహం
- వినాయక నిమజ్జనం సందర్భంగా చెలరేగిన గొడవ
అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చిన్నపొడమల గ్రామస్తులకు మద్దతుగా ఈ రోజు రోడ్డుపై బైఠాయించారు. నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా ఇక్కడి ప్రబోధానంద స్వామి వర్గీయులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం ట్రాక్టర్లు తమ ఆశ్రమం మీదుగా పోకూడదని స్వామి వర్గీయులు, అటుగానే తీసుకెళతామని గ్రామస్తులు పట్టుబట్టడంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
దీంతో ఈ రోజు ఉదయం చిన్నపొడమల గ్రామానికి చేరుకున్న జేసీ.. గ్రామస్తులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్తులకు న్యాయం జరిగేవరకూ తాను వెనక్కి తగ్గబోనని వెల్లడించారు. ఈ ఆశ్రమంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఆశ్రమ నిర్వాహకులను అరెస్ట్ చేయాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ జీవీ అశోక్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జేసీ వెంట భారీగా టీడీపీ కార్యకర్తలు తరలిరావడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.