Visakhapatnam District: మందేసి బైక్ నడిపి దొరికిపోయిన విశాఖ కానిస్టేబుల్.. అవమానంతో బైక్‌ను తగలబెట్టిన వైనం!

  • డ్రంకెన్ డైవ్‌లో దొరికిన కానిస్టేబుల్
  • కౌన్సెలింగ్‌కు హాజరై జరిమానా కట్టిన శివ
  • బండి తీసుకుని తగలబెట్టిన వైనం

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన ఓ కానిస్టేబుల్ అవమానంతో తన బైక్‌ను పోలీస్ స్టేషన్‌లోనే తగలబెట్టేశాడు. విశాఖపట్టణంలోని దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. బండిని తగలబెట్టినందుకు ఆయన మెడకు ఇప్పుడో కొత్త కేసు చుట్టుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. తాగి బైక్ నడుపుకుంటూ వెళ్లిన కానిస్టేబుల్ శివ సత్యనారాయణ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయాడు. దీంతో వెంటనే ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి వాహనాన్ని సీజ్ చేశారు. చలానా రాసిచ్చి ఈ నెల 12న కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

పోలీసులు చెప్పినట్టే కౌన్సెలింగ్‌కు హాజరైన సత్యనారాయణ జరిమానా చెల్లించి బైక్‌ను వెనక్కి తెచ్చుకున్నాడు. బైక్‌ తన చేతుల్లోకి వచ్చిన వెంటనే అక్కడే పెట్రోలు ట్యాంకు తెరిచి అగ్గిపుల్ల గీసి అందులో వేశాడు. అది చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే మంటలను అదుపు చేశారు.

ఎందుకిలా చేశావని అడిగితే.. అవమానభారంతోనే అలా చేశానని కానిస్టేబుల్ శివసత్యనారాయణ చెప్పినట్టు దువ్వాడ పోలీసులు తెలిపారు. బండిని తగలబెట్టడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు దువ్వాడ పోలీసులు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాక, అతడిపై క్షమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారు.

Visakhapatnam District
Duvvada
Drunk Driving
Constable
Fire Accident
  • Loading...

More Telugu News