Haryana: సీబీఎస్ఈ టాపర్ గ్యాంగ్ రేప్ కేసు: 10 మంది నిందితుల్లో ఆర్మీ జవాను!
- హర్యానాలో కలకలం రేపిన సామూహిక అత్యాచారం
- జవాను అరెస్ట్ కు ఆర్మీ అనుమతి తీసుకున్న పోలీసులు
- నిందితుల జాడ చెబితే లక్ష రివార్డు: హర్యానా
హర్యానాలో తీవ్ర కలకలం రేపిన సీబీఎస్ఈ టాపర్, ప్రెసిడెంట్ మెడలిస్ట్ పై గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం 10 మంది నిందితులుండగా, వారిలో ఆర్మీ జవాను కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. రాజస్థాన్ లో విధులు నిర్వహిస్తున్న పంకజ్ ఫౌజీ అనే జవాను, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అతని అరెస్ట్ కోసం ఆర్మీ అనుమతిని తీసుకున్నామని తెలిపారు.
మొత్తం ఎనిమిది నుంచి పది మంది వరకూ నిందితులుండగా, ముగ్గురి వివరాలను బాధితురాలు వెల్లడించిందని, పంకజ్ తోపాటు వారిద్దరూ కూడా పరారీలో ఉన్నారని, ఈ కేసులో వారు పట్టుబడితే, మిగతావారి వివరాలు వెల్లడవుతాయని భావిస్తున్నామని తెలిపారు. నిందితుల జాడ చెబితే రూ. లక్ష రివార్డును ఇస్తామని ప్రకటించారు.
పంకజ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల బృందం రాజస్థాన్ కు వెళ్లిందని హర్యానా పోలీస్ చీఫ్ బీఎస్ సంధు తెలిపారు. మిగతా ఇద్దరినీ మనీష్, నిషుగా గుర్తించామని చెప్పారు. వారి ఫొటోలను విడుదల చేశారు. కాగా, బుధవారం నాడు బాధితురాలు కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తుండగా, కారులో వచ్చిన దుండగులు, ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను ఓ బస్టాండు వద్ద వదిలేసి వెళ్లిన సంగతి తెలిసిందే.