kcr: ఓటు బ్యాంకు రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని తెలిసినా.. కేసీఆర్ బిల్లు పంపారు: అమిత్ షా
- కేసీఆర్ ఎంఐఎంకు భయపడుతున్నారు
- 2018లో అయినా దళితుడిని సీఎం చేస్తారా?
- తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు
తెలంగాణలాంటి చిన్న రాష్ట్రం మీద రెండు ఎన్నికల భారం అవసరమా? అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల మద్దతు లేదని... ఇదే సమయంలో బీజేపీకి ఆదరణ పెరిగిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఎంఐఎంకు భయపడుతున్నారని... అందుకే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింల ఓట్ల కోసం వారికి 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే బిల్లును కేంద్రానికి కేసీఆర్ పంపారని... ఓటు బ్యాంకు రాజకీయాలు బీజేపీ చేయదని తెలిసినా, ఆయన బిల్లు పంపారని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తారని దుయ్యబట్టారు.
2018లో అయినా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? లేదా? అనే విషయాన్ని కేసీఆర్ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని... ఏ ఒక్క జిల్లా అయినా అభివృద్ధి చెందిందా? అని ప్రశ్నించారు. రైతులకు బీజేపీ మద్దతు ధర పెంచితే... కేసీఆర్ సర్కారు రైతులకు సంకెళ్లు వేసిందని విమర్శించారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులపై దాష్టీకం జరిగిందని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ... ఫెడరల్ స్ఫూర్తికి గౌరవమిచ్చామని, రాష్ట్రాభివృద్ధికి ఎంతో సాయం చేశామని చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో మోదీ సర్కారు ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.