Chandrababu: 37 సార్లు సమన్లు ఇచ్చాక కూడా కోర్టుకు వెళ్లకుంటే.. వారెంట్లు కాక ఇంకేం వస్తాయి?: చంద్రబాబుపై అమిత్ షా విసుర్లు
- కాంగ్రెస్ ప్రభుత్వమే బాబుపై కేసు పెట్టింది
- ఇప్పుడు ఆయన అదేపార్టీతో అంటకాగుతున్నారు
- బాబు వారెంట్ కు, బీజేపీకి సంబంధం లేదు
బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన సందర్భంగా తనపై కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తుతం అంటకాగుతున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. 2010లో మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే చంద్రబాబుపై కేసు పెట్టిందని షా తెలిపారు. 2013లో పోలీసులు ధర్మాబాద్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో షా ఈ రోజు మీడియాతో మాట్లాడారు.
కోర్టు 37 సార్లకు పైగా సమన్లు జారీచేశాక కూడా వెళ్లకుంటే నాన్ బెయిలబుల్ వారంట్ కాకుండా ఇంకేం వస్తుందని చంద్రబాబుపై షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేవలం ప్రజల నుంచి సానుభూతి పొందేందుకే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసు పెట్టిన వాళ్లతోనే చంద్రబాబు ప్రస్తుతం అంటకాగుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు నమ్మేయడానికి ఆంధ్రా ప్రజలు అంత అమాయకులేమీ కాదని అమిత్ షా అన్నారు. చంద్రబాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయడానికీ, బీజేపీకి సంబంధం లేదని షా స్పష్టం చేశారు.