Telangana: రాసలీలల రాజయ్య మాకొద్దు.. పార్టీ టికెట్ ను కడియం శ్రీహరికే ఇవ్వండి!: టీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
- రాజయ్యకు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి
- ఆయన వస్తే పార్టీ చిత్తుగా ఓడిపోతుందని వ్యాఖ్య
- రెండు సార్లు గెలిపించినా పట్టించుకోలేదని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే 105 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. తాజాగా స్టేషన్ ఘనపూర్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కాకుండా తాటికొండ రాజయ్యకు ఇవ్వడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు నియోజకవర్గంలో ఆందోళనకు దిగాయి. రాజయ్య వస్తే నియోజకవర్గంలో పార్టీ సర్వనాశనం అయిపోతుందని కార్యకర్తలు ఆరోపించారు.
రాజయ్య తప్ప ఇక్కడ ఎవరు పోటీచేసినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. గత ఐదేళ్లలో కడియం శ్రీహరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనీ, ఆయనకే మరోసారి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. రాజయ్య కనీసం పార్టీని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అవినీతి, రాసలీలలకు కేరాఫ్ గా మారిన రాజయ్యకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. 2001 నుంచి రెండు సార్లు రాజయ్యను గెలిపించినా తమను పట్టించుకోలేదని వాపోయారు.