chandrababu: ఎలా ప్రొసీడ్ కావాలి?.. చంద్రబాబు అరెస్ట్ వారెంట్ పై తర్జనభర్జన పడుతున్న మహారాష్ట్ర పోలీసులు!
- ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేయాలని యోచిస్తున్న నాందేడ్ పోలీసులు
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే యోచనలో మహా పోలీసులు
- మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్న వైనం
బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనకు సంబంధించి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారెంట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు, మహారాష్ట్ర పోలీసులను సైతం దిక్కు తోచని స్థితిలో పడేసింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మహారాష్ట్ర, నాందేడ్ పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేస్తే పరిణామాలు అదుపుతప్పే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును విచారించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వారిలో తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. కొందరు ప్రస్తుతం టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా తీసుకోవాలని నాందేడ్ పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే... ముందుకు సాగాలనే యోచనలో కూడా వారు ఉన్నట్టు సమాచారం. మరోవైపు కోర్టు ముందుకు చంద్రబాబు హాజరవుతారా? లేక హైకోర్టుకు వెళతారా? అనే విషయంలో కూడా సస్పెన్స్ నెలకొంది.