West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ పోటాపోటీ ర్యాలీలు!
- అక్రమ ఇసుక తవ్వకాలపై వైసీపీ నిరసన
- తప్పుడు కేసులు బనాయించారని మండిపాటు
- పోటీ ర్యాలీ నిర్వహించిన చింతమనేని
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఈ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాగునీటి చెరువు పేరుతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూర్యారావు పేటలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీన్ని అడ్డుకున్న తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులను నిరసిస్తూ ఈ రోజు దెందులూరులో ర్యాలీ నిర్వహించారు. దీనికి పోటీగా టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కూడా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై చింతమనేని ఫైర్ అయ్యారు.
తాను ఇసుకను అక్రమంగా రవాణా చేయలేదనీ, చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. తాను సంపాదించిన ప్రతి రూపాయికి లెక్క చెబుతానని వ్యాఖ్యానించారు. వైసీసీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు తమ ఆస్తులపై లెక్కలు చెప్పేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తనపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందనీ, నిరసనల పేరుతో ఆ పార్టీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.