honour killing: ప్రణయ్ హత్యకు నిరసనగా మిర్యాలగూడ బంద్.. పరారీలో అమ్మాయి తండ్రి!
- బంద్ చేపట్టిన దళిత సంఘాలు
- మారుతీరావు ఇంటివద్ద భారీ భద్రత
- రేపు స్వగ్రామంలో ప్రణయ్ అంత్యక్రియలు
దళిత యువకుడు ప్రణయ్ హత్యకు నిరసనగా దళిత సంఘాలు ఈ రోజు మిర్యాలగూడలో బంద్ ప్రకటించాయి. హత్యకు సుపారీ ఇచ్చిన అమ్మాయి తండ్రి, రియల్టర్ మారుతీరావును వెంటనే అరెస్ట్ చేయాలంటూ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మారుతీరావు ఇంటివద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు. కుమార్తె ఇష్టంలేని పెళ్లిచేసుకోవడంతో ఆగ్రహించిన తండ్రి మారుతీరావు.. అల్లుడిని హత్య చేసేందుకు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చినట్టుగా వార్తలొస్తున్నాయి.
ఒకే కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన ప్రణయ్, అమృతల మధ్య ప్రేమ చిగురించింది. ఇందుకు అమ్మాయి కుటుంబం ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తాను భర్త వద్దే ఉంటానని స్పష్టం చేసిన అమృత .. తన కుటుంబానికి ఏమైనా జరిగితే తండ్రిదే బాధ్యతని డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు మారుతీరావుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో మారినట్లు నటించిన అతను, అల్లుడి హత్యకు రూ.10 లక్షలతో డీల్ సెట్ చేశాడు.
ఓ కిరాయి హంతకుడిని ఇందుకు నియమించుకున్నాడు. ప్రస్తుతం ఐదో నెల గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా అక్కడే ప్రణయ్ పై పదునైన కత్తితో ఆ దుండగుడు దాడిచేశాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రణయ్ తండ్రి ఫిర్యాదుతో ప్రస్తుతం పరారీలో ఉన్న మారుతీరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేపు స్వగ్రామం ముత్తిరెడ్డికుంటలో ప్రణయ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న ప్రణయ్ సోదరుడు సొంతూరికి రానున్నాడు.