Dancing Shiva: ఆస్ట్రేలియా గ్యాలరీలో ఉన్న 500 ఏళ్ల నాటి నటరాజ విగ్రహం భారత్ నుంచి దొంగిలించిందే!
- 1970లలో తమిళనాడులోని ఓ ఆలయం నుంచి చోరీ
- ఈ విగ్రహం చోరీదని 2016లో గుర్తించిన ఏజీఎస్ఏ
- తిరిగి భారత్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న 500 ఏళ్ల నాటి పురాతన డ్యాన్సింగ్ శివ (నృత్య భంగిమలోని శివుడు-నటరాజ) విగ్రహం భారత్ నుంచి దొంగిలించిందేనని తేలింది. 1970లలో తమిళనాడులోని నెల్లై ప్రాంతంలో ఉన్న ఓ ఆలయం నుంచి దీనిని చోరీ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆలయం నుంచి చోరీ చేసిన నాలుగు విగ్రహాల్లో ఇదొకటని తెలిపారు. 1970లలో ఈ చోరీ జరిగినా 1982లో ఈ విషయం బయటకు వచ్చింది. విగ్రహాలు దొంగతనానికి గురైనట్టు ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.
అలా చోరీకి గురైన విగ్రహం అక్రమార్కుల చేతులు మారి చివరికి ఆస్ట్రేలియాకు చేరుకుంది. 16వ శతాబ్దానికి చెందిన ఈ నాట్యం చేస్తున్న శివుడి విగ్రహం చోరీ చేసినదని 2016లో గుర్తించినట్టు అడిలైడ్‌లోని ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా (ఏజీఎస్ఏ) గుర్తించింది. ఆసియా ఆర్ట్ క్యురేటర్ రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైనట్టు ఏజీఎస్ఏ పేర్కొంది. మరోవైపు విగ్రహం విషయం బయటకు రావడంతో దానిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.