Hyderabad: పనిచేస్తున్న సంస్థ మేనేజర్‌పైనే కన్ను.. మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలు పంపి వేధించిన హెల్పర్!
- మహిళా మేనేజర్‌పై హెల్పర్ కన్ను
- మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఫొటోలు పంపి వేధింపు
- లొంగకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు
తాను పనిస్తున్న సంస్థ మహిళా మేనేజర్‌కు నగ్న చిత్రాలు, వీడియోలు పంపుతూ వేధిస్తున్న హెల్పర్‌కు పోలీసులు అరదండాలు వేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిందీ ఘటన. సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. కొంపల్లిలోని ఓ హెల్త్‌కేర్ సంస్థలో ఓ మహిళ మేనేజర్‌గా పనిచేస్తోంది. గత మూడు నెలలుగా ఆమె ఫోన్‌కు మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలు, వీడియోలు, అసభ్య సందేశాలు వస్తున్నాయి. అంతేకాదు, వాటిని పంపుతున్న వ్యక్తి వాట్సాప్ కాల్ చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. తనకు లొంగకుంటే ఆమెకు పంపిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు.
దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు వచ్చిన ఫోన్‌కాల్, వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన వంజరి సురేశ్ (24) అనే యువకుడే వాటిని పంపుతున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడు సురేశ్ అదే సంస్థలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.