Tamil Nadu: మరో మూడు రోజుల్లో అంధకారంగా మారనున్న తమిళనాడు.. ఆదుకోవాలంటూ మోదీకి పళని లేఖ
- రాష్ట్రంలో మూడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
- రోజుకు 72 వేల టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సిందిగా వేడుకోలు
- లేదంటే రాష్ట్రంలో అంధకారం తప్పదన్న పళని
మరో మూడు రోజుల్లో రాష్ట్రం అంధకారం కానుందని, తమను ఆదుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో మరో మూడు రోజుల విద్యుదుత్పత్తికి మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఆ తర్వాత థర్మల్ పవర్ ప్రాజెక్టులను మూసుకోవడం తప్ప మరో మార్గం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే రాష్ట్రంలో పవర్ కట్‌లు తప్పవన్నారు. కాబట్టి రోజుకు 72 వేల టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సిందిగా ప్రధాని మోదీ సహా బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖలకు సీఎం లేఖలు రాశారు.
రాష్ట్రానికి రోజుకు సగటున 20 వేగన్ల బొగ్గు అవసరం కాగా, ప్రస్తుతం 7 నుంచి 8 వేగన్ల బొగ్గు మాత్రమే సరఫరా అవుతోందని పళనిస్వామి పేర్కొన్నారు. ఈ నెల రెండో వారం తర్వాత సీజన్ ముగియనుండడంతో గాలి విద్యుత్ యంత్రాలను కూడా మూసుకోవాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా బొగ్గును సరఫరా చేసి ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.