usa: చిన్నారికి మెడికల్ చెకప్ చేయించని భారతీయ జంట.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
  • పిల్లలను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • బెయిల్ పై విడుదలైన భారతీయ జంట

అమెరికా సహా పలు యూరప్ దేశాలు చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. తల్లిదండ్రులు వారితో సరిగ్గా ప్రవర్తించకపోయినా, కొట్టినా, కనీసం తిట్టినా సరే వారిని అరెస్ట్ చేసేలా అక్కడి చట్టాలు ఉంటాయి. అయితే అక్కడ ఉండే చాలామంది భారతీయులు ఇది తెలియక ఇండియాలో ఉన్నట్లు ప్రవర్తించి ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు. తాజాగా అమెరికాలో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. చిన్నారి పాపకు వైద్య పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ భారతీయ దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

తమిళనాడుకు చెందిన ప్రకాశ్‌ సేతు, మాలా పన్నీర్‌సెల్వం దంపతులు ఉద్యోగ రీత్యా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో స్థిరపడ్డారు. ఇటీవల మాలా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అయితే వారం రోజుల క్రితం ఆరు నెలల వయసున్న కుమార్తె హిమిష ఆరోగ్యం దెబ్బతినడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే డాక్టర్ల మాటలను వినిపించుకోకుండా ఈ దంపతులు ఇంటికి వచ్చేశారు. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది నిబంధనల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసుల సహాయంతో ప్రకాశ్ ఇంటికి చేరుకున్న అధికారులు ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ప్రకాశ్ దంపతులను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ అధికారుల సంరక్షణలో ఉన్నారు. అయితే ఈ విషయమై కొందరు మిత్రులు స్పందిస్తూ.. చిన్నారికి డాక్టర్లు చెప్పిన పరీక్షలు చేయించేందుకు కావాల్సినంత నగదు ప్రకాశ్ దంపతుల వద్ద లేదని తెలిపారు. చిన్నారి అనారోగ్యాన్ని వారు తీసుకున్న ఇన్సూరెన్స్ కవర్ చేయలేకపోయిందని వెల్లడించారు. మరోవైపు బెయిల్ పై విడుదలైన ప్రకాశ్ దంపతులు కోర్టు విచారణను ఎదుర్కోనున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News