Madhya Pradesh: 'మంచి కోడలు కావాలా? అయితే మా దగ్గరకి రండి!' అంటున్న భోపాల్ యూనివర్సిటి
- భోపాల్ లోని వర్సిటీలో సరికొత్త కోర్సు
- అత్తారింటిలో మసలుకోవడంపై శిక్షణ
- త్వరలోనే ప్రారంభించనున్న విశ్వవిద్యాలయం
సాధారణంగా దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా స్పెషలైజేషన్ కోర్సులు ఉంటాయి. డిగ్రీలో చదివిన కోర్సులకు అనుబంధంగా ఈ స్పెషలైజేషన్ అందిస్తారు. అయితే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని బర్కతుల్లా యూనివర్సిటి మాత్రం కాస్త డిఫరెంట్. ఇక్కడ చదువుతో పాటు సంస్కారవంతమైన, ఆదర్శవంతురాలైన కోడలిగా ఎలా ఉండాలో చెబుతారు. ఇందుకోసం యువతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోర్సును ప్రారంభించనున్నట్లు వర్సిటి వైస్ ఛాన్స్ లర్ ప్రొ.డీసీ గుప్తా తెలిపారు. అత్తవారింట్లో అడుగుపెట్టాక ఎలా మసలుకోవాలో ఇందులో చెబుతామన్నారు.
ఈ కోర్సుతో పాటు శిక్షణను వర్సిటీలోని సైకాలజీ, సోషియాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాలు సంయుక్తంగా చేపడుతున్నాయని వెల్లడించారు. అమ్మాయి అత్తవారింట్లో త్వరగా సర్దుకుపోగలిగితే ఆ కుటుంబమంతా ఆనందంగా ఉంటుందని గుప్తా తెలిపారు. తమ దగ్గర శిక్షణ పొందిన అమ్మాయిలు మంచి కోడళ్లుగా రాణిస్తారని హామీ కూడా ఇచ్చారు. ఇందుకోసం ప్రతి బ్యాచ్ కు 30 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తామనీ, వచ్చే ఏడాది ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.