uno: ఐక్యరాజ్య సమితిలో చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకే నాన్-బెయిలబుల్ వారెంట్ !: టీడీపీ నేత పెద్దిరెడ్డి ఆరోపణ
- చంద్రబాబు ఎదుగుదలను మోదీ తట్టుకోలేకున్నారు
- అప్పట్లో కేసు లేదని మహారాష్ట్ర పోలీసులు చెప్పారు
- ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతల అత్యవసర సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. చంద్రబాబుకు జారీ అయిన వారెంట్ తో పాటు తాజా రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్బంగా టీడీపీ నేత పెద్దిరెడ్డి ఓ ఛానల్ తో మాట్లాడుతూ.. బాబ్లీ సందర్శన సందర్భంగా మహారాష్ట్ర పోలీసులు తమను తీవ్రంగా వేధించారని తెలిపారు. తమను కోళ్ల ఫాంలో ఐదు రోజులు నిర్బంధించారని వెల్లడించారు. అర్ధరాత్రి శంషాబాద్ లో వదిలేసి కేసు లేదని చెప్పారన్నారు.
చంద్రబాబు ఈ నెల 23న ఐక్యరాజ్యసమితిలో జరిగే కార్యక్రమంలో ప్రసంగించబోతున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యలో ఓ ముఖ్యమంత్రి తన స్థాయి కంటే ఎక్కువగా ఎదగడం ఇష్టం లేకపోవడంతోనే ప్రధాని మోదీ ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇది పక్కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని ఆరోపించారు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన మోదీ ఇతరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
కాంగ్రెస్, టీడీపీ కలిసి ఏర్పాటు చేస్తున్న మహా కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనకు తీవ్ర పరాభవం తప్పదని మోదీకి భయం పట్టుకుందన్నారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళతామన్నారు. చంద్రబాబుకు నోటీసులు వచ్చిన విషయం తమకు మీడియా ద్వారానే తెలిసిందని వ్యాఖ్యానించారు.