Indian Railways: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ.. ఫ్లెక్సీ ఫేర్ విధానానికి స్వస్తి!
- డైనమిక్ ప్రైసింగ్ విధానం తొలగింపు
- 40 రైళ్లలో పూర్తిగా ఎత్తివేత
- మిగతా 102 రైళ్లలో 60 శాతం వరకూ డిస్కౌంట్
రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ విధానానికి స్వస్తి చెబుతున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. డైనమిక్ ప్రైసింగ్ పేరిట ప్రస్తుతం 142 రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ పాలసీ అమలవుతుండగా, చార్జీల భారం మోయలేకపోతున్నామని గగ్గోలు పెడుతున్న ప్రయాణికులకు శుభవార్త చెబుతూ, తొలి దశలో 40 రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్ కు గుడ్ బై చెబుతున్నామని, మరో 102 రైళ్లలో 60 శాతం వరకూ డిస్కౌంట్ ను ఇవ్వనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పద్ధతిలో రైలు ప్రయాణ చార్జీలు విమాన టికెట్ ధరలను మించిపోతుండటంతో, కనీసం 50 శాతం సీట్లు కూడా అమ్ముడు పోని పరిస్థితి నెలకొంది. పైగా ఈ విధానం అమలుపై విమర్శలు వస్తున్న వేళ, రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
40 రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్ ను ఎత్తేస్తున్నామని వెల్లడించిన అధికారులు, మిగతా రైళ్లలో ప్రయాణానికి నాలుగు రోజుల ముందు నుంచి చివరి క్షణం వరకూ బుక్ చేసుకునే టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ను, 60 శాతం కన్నా తక్కువగా సీట్ల రిజర్వేషన్ ఉన్న రైళ్లలో గ్రేడెడ్ డిస్కౌంట్ ను అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం 44 రాజధాని రైళ్లు, 46 శతాబ్ది రైళ్లు, 52 దురంతో రైళ్లలో ఈ విధానం అమలవుతుంది. రైలు టికెట్ ధరలు భారీగా ఉండటంతో, తగ్గింపు రేట్లకు లభిస్తున్న విమానాలను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆదాయానికి గండిపడగా, రైల్వే శాఖ ఆలస్యంగానైనా కళ్లు తెరిచిందని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు.