Pune: పరిమళించిన మానవత్వం... వినాయక మండపం విరాళాలతో స్నేహితుడి ప్రాణం కాపాడారు!
- పుణెలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సతీశ్ జోరీ
- బంధువులు లేకపోవడంతో స్పందించిన స్థానిక యువకులు
- రూ. 4.50 లక్షలతో చికిత్స, సర్వత్రా ప్రశంసలు
వారంతా స్నేహితులు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని విరాళాలు సేకరించారు. మొత్తం రూ. 6 లక్షలు చేతికందాయి. ఈలోగా తమ కంటిముందు తిరుగుతుండే స్నేహితుడు తీవ్రమైన అనారోగ్యం బారిన పడగా, తమలోని మానవత్వాన్ని చూపుతూ, అతని ప్రాణాలను కాపాడేందుకు విరాళాలను ఖర్చు చేశారు. ఈ ఘటన పుణెలో జరిగింది. నవశక్తి గణేష్ మండలి సభ్యులు ఓ మంచి పనికి డబ్బును ఖర్చు పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
తమ ప్రాంతానికి చెందిన సతీశ్ జోరీ అనే యువకుడికి రోడ్డు ప్రమాదం జరిగి తలకు తీవ్ర గాయం కాగా, బంధువులు ఎవరూ లేకపోవడంతో స్థానిక ఆసుపత్రులు వైద్యం చేసేందుకు నిరాకరించాయి. రక్తస్రావంతో పడివున్న సతీశ్ ను స్థానికులు కొర్తుద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్య ఖర్చులను నవశక్తి గణేష్ మండలి భరించింది. తాము వసూలు చేసిన చందాల్లో రూ. 1.5 లక్షలను గణేశ్ ఉత్సవాల నిమిత్తం వెచ్చించి, మిగతా రూ. 4.5 లక్షలను సతీశ్ వైద్యం కోసం కేటాయించారు. ప్రతి సంవత్సరం భారీ షెడ్ లో గణనాధుని కొలువుతీర్చే ఈ మిత్రబృందం, ఈ దఫా కొద్దిపాటి స్థలంలో చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీరు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.