Chandrababu: బాబ్లీ నిరసనల కేసు: విధినిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నారంటూ చంద్రబాబుపై నేరారోపణ!

  • చంద్రబాబు సహా 15 మందికి నోటీసులు
  • 144 సెక్షన్ ను పట్టించుకోలేదు
  • నిబంధనలను అతిక్రమించారని ఆరోపణలు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై జారీ అయిన అరెస్ట్ వారెంట్ తీవ్ర రాజకీయ కలకలం రేపుతుండగా, ఎనిమిది సంవత్సరాల నాడు జరిగిన ఘటనపై ఇంతకాలమూ ఒక్కసారైనా విచారణకు పిలవకుండా, ఎటువంటి నోటీసులూ జారీ చేయకుండా, ఇప్పుడు ఒక్కసారిగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడాన్ని తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా, 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఆ కేసులోనే ఇప్పుడు నోటీసులు జారీ చేశారు.

ఇక నిన్న తిరుమల శ్రీవారి సేవలో ఉన్న సమయంలో తనకు నోటీసులు వచ్చాయని తెలుసుకున్న చంద్రబాబు, తనపై మోపిన అభియోగాల గురించి అందుబాటులో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2010లో ధర్మాబాద్ కు చేరుకున్న వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. బాబ్లీకి వెళ్లనీయకుండా లాఠీచార్జ్ చేసి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, బాబును బలవంతంగా విమానంలో హైదరాబాద్ కు తరలించారు. విధినిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144 సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా నిబంధనలను అతిక్రమించారని ఆరోపిస్తూ, కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఎన్నడూ విచారించలేదు. ఇప్పుడు ఏకంగా నోటీసులు పంపించారు. దీనిపై చంద్రబాబు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

Chandrababu
Babli
Protest
Court
Notice
NBW
  • Loading...

More Telugu News